Total Pageviews

Friday, December 29, 2017

జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర

జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర
ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

పురాణగాధ

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది.[1] కురుక్షేత్రయుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానంజ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికిఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.

ఆలయ విశేషాలు

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.

రవాణా సౌకర్యాలు

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

పూజా విశేషాలు

ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రఒడిషామధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.3 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.

Saturday, August 26, 2017

మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం.


 పద్మాకారంలో ఆలయం. కింద గం గమ్మ.. మధ్యన రాజరాజేశ్వరి మాత..ఆ పైన త్రినేత్రుడు కొలువుదీరిన మహాద్భుతమైన చోటు. చుట్టూ పద్మరేకుల్లా చిన్నచిన్న శివాలయాలు.., రావి, వేప, మేడి చెట్లు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతున్న ప్రాంతం..అదే మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ ఆల యం దినదినాభివృద్ధి చెందుతూ..భక్తుల కొంగుబంగారమై అలలారుతోంది. ఈకోవెల 6తేదీ నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. -మహేశ్వరం

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టె కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పద్మాకారంలో ఉంటుంది. దీనిచుట్టూ శ్రీహరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీఅవిముక్తేశ్వరుడు, శ్రీఅఘోరేశ్వరుడు, శ్రీఅమరేశ్వరుడు, శ్రీఅమృతేశ్వరుడు, శ్రీగంగాధేశ్వరుడు, శ్రీఇష్టకామేశ్వరుడు, శ్రీముకేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీఏకాంబేశ్వరుడు, శ్రీమణికర్ణికేశ్వరుడు, శ్రీమహానందీశ్వరుడు, శ్రీఅమరావతీశ్వరుడు, శ్రీకాశీపతీశ్వరుడు, శ్రీమంగళగౌరీశ్వరుడు ఆలయాలు పదరేకుల్లా ఉంటాయి.

ఆలయంలోని అష్టాదశంగా (18 సంఖ్య వచ్చేలా) నిర్మించడం విశేషం. సహాజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింది భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.

చరిత్రకు నిలువుటద్దం గడికోట
కాకతీయుల కాలం నాటి చరిత్రకు నిలువుటద్దంగా ఆలయం పక్కనే గడికోట నిర్మాణం నేటికీ నిలిచి ఉంది. కొంత శిథిలావస్థకు చేరినప్పటికీ కోటలోని కట్టడాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గడికోట చుట్టూ ఆర్చ్‌లతో పాటు మధ్యలో ఉన్న కొలను ను అద్భుతంగా నిర్మించారు.

మహత్యం..త్రివృక్షం...:
ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్లు ఒకేచోట పెరగడంతో దీన్ని తివృక్ష చెట్టుగా పిలుస్తారు. పిల్లలు కానివారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కట్టితే పిల్లలు పుడుతారని నమ్మకం. ఈవృక్షం కిందనే నాగేంద్రాలయం ఉంది.

శివగంగకు దారి ఇలా..:
ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలో మీటర్లు దూరంలో ఉంటుంది. ఫలక్‌నుమా, మిధాని, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డిపోల నుంచి బస్సు సౌకర్యం ఉంది. జూబ్లీబస్ స్టేషన్ నుంచి మహేశ్వరానికి 253/ 90కె, చార్మినార్ నుంచి 253 ఎం, 253 కె, 253 టి, 253 హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఎ/ 253ఎం. జూబ్లీహిల్స్ నుంచి 253 ఎం, బస్సులు ఎక్కాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఔటర్‌రింగ్ రోడ్డు మీది నుంచి తుక్కుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాన్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చరిత్ర...
తానీషా నవాబుల వద్ద పని చేసిన అక్కన్న మాదన్నలు 1672లో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగాన 37 కిలో మీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న ,మాదన్నలు ఇక్కడికి చేరుకునేవారట.

మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయస్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి . ఎనిమిదేళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెబుతోంది. 1677లో ఈ ఆలయం పునర్‌నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. 1687లో ఔరంగజేబు దాడిలో గుడిని ధ్వంసమైనట్లు చెబుతుంటారు.

Friday, August 25, 2017

శక్తిపీఠాలు

శ్రీ సరస్వతీదేవి

Related Image అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది ... 'శ్రీ సరస్వతీ దేవి' శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్ లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మత పరమైన దాడులకు గురి కాసాగింది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మొదలైంది. దాంతో శ్రీ ఆది శంకరాచార్యుల వారు, అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ... ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకు వచ్చారు. ఆ విజ్ఞాన శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేశారు.

అప్పటి నుంచి కాశ్మీర్ లోని సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునే వారు, శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక్కడి అమ్మవారు భక్తుల పాలిట కామధేనువు ... కల్ప వృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది.

ఈ భారీ వినాయకుడి గురించి తెలుసా?


కోయంబత్తూరు: వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉండే సందడే వేరు. తొమ్మిదిరోజుల పాటు వూరూ వాడా.. పల్లె పట్టణం.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గణనాథుడి స్మరణలో మునిగిపోతారు. తమ శక్తి కొలదీ గణపతి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేసి నిమజ్జనం చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో వినాయక ఆలయాలున్నా కొన్నింటికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ముంతి వినయగర్‌ ఆలయం. కోయంబత్తూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో వినాయక విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందింది. 19 అడుగుల ఎత్తు.. 11 అడుగుల వెడల్పు.. 190 టన్నుల బరువుంటే ఈ విగ్రహం ఆసియాలోనే రెండో అతిపెద్ద ఏకశిలా విగ్రహంగా రికార్డులకెక్కింది. మామూలు రోజుల్లోనే భక్తులతో కిటకిటలాగే ఈ ఆలయం.. వినాయక చవితి రోజున ఇసుకేస్తే రాలనంతగా మారిపోతుంది. ఈ భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు.



ఉడిపి కృష్ణాలయం



రామనాథ స్వామి దేవాలయం


శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము



Saturday, August 19, 2017

చారిత్ర‌క శిల్ప‌క‌ళా హంపి

తుంగభద్ర నదీ పరవళ్లు ఓవైపు.. పచ్చదనం పరచిన ప్రకృతి అందాలు మరోవైపు. అదే, విజయనగర సామ్రాజ్య వైభవానికి తీపి గురుతు హంపీి. అక్కడి ఎత్తయిన కొండ గుట్టల మధ్య దాగివున్న శిల్ప సౌందర్యాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే! అలనాటి స్మారకల శిల్పసౌందర్య వైభవం తెలుసుకోవాలంటే హంపిని సందర్శించాల్సిందే!

కర్ణాటకలోని హంపీకి చేరుకున్నాక అక్కడ సందర్శనీయ ప్రాంతాలకు తిరిగేందుకు అనువైన వాహనం ఆటో అనే చెప్పుకోవాలి. ఒక రోజంతా తిప్పడానికి అనువైన 700 నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటారు. హంపీలోని ఆటోడ్రైవర్లు మంచి గైడ్స్‌గా పేరొందారు. వారికి ఇక్కడి చుట్టుపక్కల కట్టడాలపై పూర్తి అవగాహన ఉంటుంది. హంపీలో 1600 మోమోరియల్స్‌ ఉన్నాయి. అందులో 80 కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందినవి.

విఠ్ఠల టెంపుల్‌ కాంప్లెక్స్‌
హంపీ ప్రాంతం విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక. అలాంటి హంపీికి తలమానికంగా నిలిచేది విఠ్ఠల దేవాలయం. తుంగభద్ర నది ఒడ్డున దక్షిణం వైపున ఉన్న ఈ దేవాలయం హంపీి నగరంలో ఎక్కువగా సందర్శించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. రెండవ దేవరాయ కాలంలో నిర్మించ బడిన ఆలయం పూర్తి రాతి కట్టడం. ఇది 16వ శతాబ్దానికి చెందింది.
ఈ ఆలయానికి ఎదురుగా ప్రసిద్ది చెందిన రాతి రథం ఉంది. ఏకశిలతో తయారుచెయ్యబడిన ఈ రథం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఏకశిలా రథం అంటే, ఒకే శిలతో దీన్ని నిర్మించారు. ఒడిశాలోని కోణార్క్‌ ఆలయం స్పూర్తితో ఈ ఏకశిలా రథాన్ని తీర్చిదిద్దారు. అయితే, ఈ రథం పూర్వ వైభవాన్ని కోల్పోయిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. రథం గోపురం, రథం ముందున్న ఏనుగు తొండాలను కత్తిరించారు. చుట్టూ సైనికులు, వేటగాళ్లు, పోర్చుగీసులు, అరబ్బులు, పర్షియన్ల చిత్రాలున్నాయి.
ఈ ఆలయంలోని మరొక ఆకర్షణ సంగీతం వినిపించే స్తంభాలు. ప్రధాన స్తంభాం చుట్టూ ఏడు చిన్నపాటి స్తంభాలు ఉంటాయి. ఈ ఏడు స్తంభాలను తాకినప్పుడు సంబంధిత వాయిద్య పరికరం సప్తస్వరాలను పలుకుతూ ఉంటాయి.

అద్భుత శిల్పకళా నిలయం
హంపీిలోని అందమైన మందిరాలలో కృష్ణమందిరం ఒకటి. విజయనగర మహారాజు కృష్ణదేవరారున్‌ కళింగ విజయం తర్వాత దీన్ని కట్టించారు. ఈ మందిరంలో ఉన్న కృష్ణ విగ్రహాన్ని ఒడిశా నుంచి తీసుకొచ్చారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. 1513లో కృష్ణదేవరాయలు కళింగ నుంచి ఈ బాలకృష్ణమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి, ఇక్కడ ఈ మందిరంలో స్థాపించారట! ప్రస్తుతం ఇక్కడ ఈ విగ్రహం లేదు. ఈ విగ్రహం చెన్నెయిలోని మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పంచాయతన్‌ శైలిలో ఉన్న
ఈ మందిరంలో చాలా ఉప మందిరాలు, పాకలు, మహామండపాలు ఉన్నాయి. మహామండ పంలో విష్ణుమూర్తి దశావతారాలు అద్భుతంగా చిత్రించి ఉంటాయి. మందిరంలోని పరిసరాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లగానే రెండురాళ్లు మిళితమై ఉన్న ఓ దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఆ రెండు రాళ్లను చూస్తే పెనుగులాడుకుంటున్నట్లు కనిపిస్తాయి. అందుకే వీటిని 'సిస్టర్‌ రాక్స్‌' అని పిలుస్తారు.

పురంధరదాసు మంటపం
తుంగభద్ర నదీ తీరంలో నిర్మించిన శిలాభవనమే పురంధరదాసు మంటపం. క్రీస్తుశకం 1540లో రాయలు ఈ శిలా భవనాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఉన్న పురంధరదాసు భక్తి గేయాలను రచించి వినిపిస్తుండేవారట! దాస సాహిత్యం, సంస్కృతి నలు దిశలా వెలుగొందాలని రాయలు ఈ మంటపాన్ని నిర్మించారు. వర్షాకాలంలో తుంగభద్ర ఎన్నోసార్లు పొంగి పొర్లి, మంటపం మునిగిపోయినా ఏమాత్రం చెక్కుచెదరలేదు.

లోటస్‌మహల్‌, గజశాల!
ఇక్కడికి దగ్గరలోని మహానవమి దిబ్బ నుంచి కొంత ముందుకు వెళితే కనిపించేదే 'లోటస్‌ మహల్‌' (కమల మందిరం) దీన్ని చిత్రాంగిణి మహల్‌ అని కూడా పిలుస్తారు. ఈ 'లోటస్‌ మహల్‌' హిందూ, ముస్లిం శైలిలో ఉండటం విశేషం. ఈ మహల్‌ చుట్టూ ఉద్యానవనం ఉన్న ఆనవాళ్లు, కోట ప్రాంతం, రక్షకభట నిలయం ఉన్నది చూస్తే ఇక్కడ మహారాణులు విశ్రాంతి నిమిత్తం వచ్చే వారని చరిత్రకారులు చెబుతారు. 'లోటస్‌మహల్‌' పక్కగా గజశాల కనిపిస్తుంది. ఇందులో విజయనగర రాజులు ఏనుగులను పోషించేవారని అక్కడివారు చెబుతుంటారు. 11 ఏనుగులు ఆశ్రయం పొందటానికి ఇక్కడ గజశాల ఉంది. భవ్యమైన కమానులు కలిగిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

హంపీి బజార్‌
విరూపాక్ష బజార్‌గా ప్రాచుర్యం చెందిన ఓ ప్రాంతం సందర్శకులకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంటుంది. మాతంగి కొండ క్రింద కొండ వద్ద ఉన్న ఈ ప్రాంతం విరుపాక్ష ఆలయానికి తూర్పు నుంచి కిలోమీటరు దూరంలో కనిపిస్తుంది. ఈ వీధికి రెండువైపులా పాత దుకాణాల వరుస ఉంటుంది. కొన్ని రెండు అంతస్తులు ఉన్నవి కూడా తారసపడతాయి. ఈ వీధికి తూర్పు చివరన భారీ నంది విగ్రహం, ఆ విగ్రహం పక్కనే రెండు అంతస్తులు కలిగిన ఫోటో గ్యాలరీ ఉంటుంది. అలెగ్జాండర్‌ గ్రీన్‌ లా చేత 1856 లో తీయబడిన ఛాయాచిత్రాలు ఇక్కడి ప్రదర్శనలో ఉన్నాయి. సమీపంలో ఉన్న బహిరంగ వేదిక వార్షిక హంపీ వేడుకలకు ప్రధాన వేదికగా వ్యవహరిస్తుంది. ఈ గ్యాలరీకి ఎదురుగా కొంచెం దూరంలో గ్రామంలోని పిల్లల కోసం ఏర్పాటైన నర్సరీ స్కూల్‌ని గమనించవచ్చు. ఇది ప్రపంచంలోనే పురాతనమైన నర్సరీ స్కూల్‌గా అక్కడివారు భావిస్తున్నారు. ఇవేకాకుండా హంపీలో సందర్శించవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప చారిత్రక ప్రదేశమైన హంసీలో అడుగుపెడితే మనకి కళ్ళకు కట్టినట్టుగా టైం మెషిన్‌లో ప్రయాణం చేసినట్లుగా మనల్ని ఆనాటి రోజులకి తీసుకోపోతుంది.

చేరుకోవడం ఎలా?
హంపీని వాయు మార్గంలో చేరుకునేందుకు విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో 60 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి వద్ద దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం బెంగళూరు, ముంబయి, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, తిరుపతి వంటి నగరాలకు అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయంలో దిగి క్యాబ్‌ లేదా ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి హంపీ చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే, హంపీలో రైల్వేస్టేషన్‌ లేదు. దీనికి సమీపాన ఉన్న రైల్వేస్టేషన్‌ హోస్పేట్‌ రైల్వే స్టేషన్‌. ఇది హంపీి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, హుబ్లీ, పూణే, సొలాపూర్‌, చెన్నై, ముంబయి, బెల్గాం, పనాజీ, హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. హోస్పేట్‌ రైల్వేస్టేషన్‌లో దిగి, బస్సు లేదా క్యాబ్‌ వంటి వాహనాల్లో హంపీి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం చారిత్రక పట్టణమైన హంపీికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగిన హంపీకి బళ్ళారి, బెంగళూరు వంటి ప్రదేశాల నుంచి ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు అందుబాటులో ఉంటాయి.

సేకరణ : చందు తిలారు

యాదాద్రి
యాదగిరిగుట్ట- నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.
క్షేత్ర మహిమ/ స్థల పురాణం: శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందన్నది ఐతిహ్యం. సింహం ఆకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసే తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడట! ఆ మేరకు ఇక్కడ ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడిగా నిత్యపూజలు అందుకొంటున్నాడు. గ్రహ పీడితులు, మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఆంజనేయస్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.

త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థలపురాణం. జ్వాలా నరసింహుడు, యోగా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శమిచ్చిన స్వామి.. లోకకల్యాణార్థం మీరు ఈ రూపాల్లో.. ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరికపై ఇక్కడే ఉండిపోయారట!
దర్శనవేళలు
* ఉదయం 4 గంటలకు ఆలయం తెరుస్తారు.
* ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ. 100, రూ. 150 టికెట్లపై ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది.
* ఒక ప్రత్యేక దర్శనం టికెట్‌పై ఒకరినే అనుమతిస్తారు. క్యూలైన్‌లోనే ఈ ప్రత్యేక టికెట్లను విక్రయిస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు విరామం
* ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టికెట్‌ రూ. 500, అర్చన రూ. 216, సువర్ణ పుష్పార్చన రూ. 516
* త్వరలో ఆన్‌లైన్‌లో పూజ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
పరిసరాలు.. ఉపాలయాల విశేషాలు: యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని మాత సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం.. ఈ రెండు ఆలయాల్లోనూ నిత్యపూజలు కొనసాగుతుండటం విశేషం!
ప్రధాన పూజల వివరాలివి.. ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కల్యాణోత్సవం, అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.
ఆర్జిత సేవల వివరాలు
* ఆలయంలో నిత్యం జరిగే శ్రీ లక్ష్మీ నరసింహుల నిత్య కల్యాణం టికెట్టు ధర రూ. 1,250
* శుక్రవారం అమ్మవారి ఉత్సవ సేవ టికెట్టు ధర రూ. 750
* ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, టికెట్‌ధర రూ. 216
* ప్రతి ఏకాదశి రోజున లక్ష తులసి పుష్పార్చన, టికెట్‌ ధర రూ.5,116
* స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకం, టికెట్‌ ధర రూ. 750
* కొండపైనే ఉన్న శివాలయంలో లక్షబిల్వార్చన టికెట్టు ధర. రూ. 250.
* శనివారం నవగ్రహ పూజలు, సోమవారం రుద్రాభిషేకం, కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి రూ. 250
*నవగ్రహ పూజకు రూ. 116, రుద్రాభిషేకం కోసం రూ. 116 టికెట్లను ఖరీదు చేయాలి.
వసతి సౌకర్యాలు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొండపై వసతిగదులు, కాటేజీలు ఉన్నాయి. రుసుము రూ. 200 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది. దేవస్థానం కాటేజీలు విచారణ కోసం ఫోన్‌: 08685- 236623, 236645 నంబర్లలో సంప్రదించవచ్చు.
యాదగిరిగుట్టలోని ప్రైవేటు లాడ్జిల సమాచారం
వెంకటేశ్వర లాడ్జి ఫోన్‌: 81252 69331
వెంకటాద్రి లాడ్జి ఫోన్‌: 08685- 236455
భూలక్ష్మి లాడ్జి ఫోన్‌: 08685-236999
శివలాడ్జి ఫోన్‌: 92900 63755
మహేశ్వరీ లాడ్జి ఫోన్‌: 92900 63755
భవ్య ఫంక్షన్‌ హాలు లాడ్జి ఫోన్‌: 92472 87901
రవాణా సౌకర్యం:  హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు నల్గొండ నుంచి.. హైదరాబాద్‌- ఎంజీబీఎస్‌ నుంచి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. జేబీఎస్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు చొప్పున టీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సుల సౌకర్యమూ ఉంది. దగ్గరలోని విమానాశ్రయం.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయమే!